రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవాలని మొక్కుకున్నా
రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలని పెద్దమ్మ గుడిలో తాను మొక్కుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో కేసీఆర్ ప్రగతి భవన్‌ను విడిచి పారిపోయే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్మేలపై తిరగబడి కొట్టమని ప్రజలకు పిలుపునిస్తామని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యే హరిప్రియపై చెప్పుల దాడి ఘటనను కేసీఆర్, కేటీఆర్‌పై దాడిగా చూడాలని ఆయన ప్రకటించారు. విద్యార్థులు మరణిస్తే వెళ్లని కేసీఆర్ కేరళ టూర్ ముఖ్యమైందని మండిపడ్డారు. 50 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి ఐదడుగుల విగ్రహాన్ని కూల్చేశాడని మండిపడ్డారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, తక్షణమే గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే బోఫోర్స్ స్కాంను మోదీ ప్రస్తావిస్తున్నారని, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని అన్నారు.













