ఆగస్టులో బహు పరాక్: మంత్రి కిషన్రెడ్డి
కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.. ఆగస్టు నెలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన టిమ్స్ లో వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడి వసతులపై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ను వేగంగా అమలు చేయాలని సూచించారు. కొవిడ్-19ని కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు.
శరవేగంగా కేసులు పెరుగుతున్న పరిస్థితిలో ఆగస్టు నెలలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు గడప దాటి బయటకు రావొద్దని కోరారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలు కావొద్దని హితవు చెప్పారు. అవసరాన్ని బట్టి మరింతగా వైద్య సిబ్బందిని నియమించుకోవాలని వైద్య సిబ్బందికి జీతాలతో పాటు.. అదనంగా ఇన్సెటివ్స్ అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బయట తిరుగుతోన్న హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్ ను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇప్పటికే తెలంగాణకు 1200 వెంటిలేటర్లు అందించామన్నారు. కరోనాపై పోరాటంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు.













