హైదరాబాద్ మెట్రో రెండో దశకు ‘కేంద్ర’ గ్రహణం?
హైదరాబాద్ మౌలిక సదుపాయాల విస్తరణలో కీలక మైలురాయిగా భావిస్తున్న మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు భవితవ్యం ఇప్పుడు అయోమయంలో పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, ఫైళ్ల కదలికలో జాప్యం రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, సమన్వయ లోపాన్ని బహిర్గతం చేశాయి.
మెట్రో రెండో దశ విస్తరణ, ఆర్థిక సహాయంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించిన తీరు విస్మయానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టు అనుమతుల వ్యవహారం పూర్తిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనిదని, ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌నే అడగాలంటూ ఆయన సున్నితంగా తప్పుకున్నారు. సాంకేతికంగా మెట్రో ప్రాజెక్టులు పట్టణాభివృద్ధి శాఖ కిందకే వస్తాయన్నది వాస్తవమే అయినప్పటికీ, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్’ ద్వారా రుణ సమీకరణ అంశంపైనా తనకేమీ తెలియదని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక కీలక ఆర్థిక సంస్థ ద్వారా రుణ మంజూరు విషయంలో సంబంధిత శాఖ మంత్రికి సమాచారం లేకపోవడం, లేదా దాటవేసే ధోరణి ప్రదర్శించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
జూన్ 22న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాడు మెట్రో ఫేజ్-2 అనుమతులు, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా, మరుసటి రోజు అంటే జూన్ 23న మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలోనూ అశ్విని వైష్ణవ్ స్వయంగా పాల్గొన్నారు. నాడు ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని, అపాయింట్మెంట్లు ఇప్పించడంలోనూ కీలకంగా వ్యవహరించిన మంత్రి, ఐదు నెలల తర్వాత ఈ అంశంతో తనకు సంబంధమే లేనట్లు మాట్లాడటం కేంద్ర ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
మరోవైపు సాంకేతిక కారణాల పేరుతో ప్రాజెక్టుకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. వరుసగా రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల అనంతరం, మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఎల్ అండ్ టీ నుండి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి అవసరమైన రుణ సేకరణ, ఫేజ్-2 నిర్మాణ వ్యయంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ‘ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్’ ను కన్సల్టెంట్‌గా నియమించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం తరఫున ఒక అధికారిని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిని సమన్వయకర్తలుగా నియమించారు. అయితే, ఈ నిర్ణయం జరిగి ఐదు నెలలు గడిచినా కన్సల్టెంట్ నివేదిక గానీ, క్షేత్రస్థాయి పురోగతి గానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
కేంద్రం పెట్టిన షరతుల మేరకు ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, కేంద్రం ఎందుకు ఫైలును తొక్కిపెడుతోందో అంతుచిక్కడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఐఆర్ఎఫ్సీ ద్వారా రుణం రాకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారన్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలకు, తాజాగా రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం పెద్ద అడ్డంకిగా మారింది.







