పొట్ట విప్పి చూడ ……..ఇద్దరు మంత్రుల ముద్దుల వియ్యంకుడు
తెలంగాణ టీడీపీలో కీలక వ్యక్తిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఎర్రజెండా ఎగరేశారు. ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈగ వాలనివ్వడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును యనమలకు ఇచ్చారని అందుకే ఈ ప్రేమ ఆప్యాయతలంటూ కామెంట్ చేశారు. దీంతో యనమల-కేసీఆర్ బంధంపై ఒక్కసారిగా అందరి దృష్టీ పడింది. అసలీ కాంట్రాక్టు కథాకమామిషుకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ ఎవరని ఆరా తీస్తే పుట్టా సుధాకర్ యాదవ్ అనే పేరు బయటకొచ్చింది. ఏపీ మంత్రి యనమల, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో వియ్యం అందుకున్నారు సుధాకర్ యాదవ్. ఇద్దరు మంత్రుల కుమార్తెలకు తన కుమారుల్ని ఇచ్చి పెళ్లి చేసిన సుధాకర్ యాదవ్ అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో పంట పండించేస్తున్నారు. కడప జిల్లా మైదుకూరులో కూర్చొని సైలెంట్ గా రెండు ప్రభుత్వాల్లో తన హవా కొనసాగించేస్తున్నారు సుధాకర్ యాదవ్.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో రూ. 450 కోట్ల ప్రాజెక్టు, కాలేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.1500 కోట్లు, డబుల్ బెడ్ రూం ప్రాజెక్ట్ లో సబ్ కాంట్రాక్టుగా రూ. 500కోట్ల మేర పనులు దక్కించుకున్నారు సుధాకర్ యాదవ్. వీటి గురించే రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారని వినిపిస్తోంది. టెన్త్ క్లాస్ చదివిన సుధాకర్ 1979లో వ్యాపారం ప్రారంభించారు. మొదట బెంగళూరు కేంద్రంగా వ్యవహారాలు సాగించి.. 2002లో హైదరాబాద్ లో పీఎస్కే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేశారు. రాజకీయ బంధుత్వాల్ని ఆధారంగా చేసుకుని చెలరేగిపోయారు. 2014 నుంచి 2016 వరకూ సుధాకర్ యాదవ్ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా సేవలందించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ వర్క్స్ కాంట్రాక్టులు చేసే సదరు పీఎస్కే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇయర్లీ టర్నోవర్ ప్రస్తుతానికి 5వేల కోట్ల నుండి 10వేల కోట్లవరకూ చేరింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో పుట్టా సుధాకర్ యాదవ్ వెలుగులోకి వచ్చారు.













