గోసంరక్షణకు టీటీడి వినూత్న సేవ..గుడికో గోమాత
హైదరాబాద్లో, విజయవాడలో ప్రారంభం
సనాతన హిందూధర్మ పరిరక్షణలో భాగంగా గోసంరక్ష కోసం గుడికో గోమాత కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. ఇందులో భాగంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో, తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జూబ్లిహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ లోకల్ ఏరియా కమిటీ అధ్యక్షుడు గోవింద హరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోమాతకు పూజ చేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఐదు నుంచి పది ఆలయాలకు టీటీడీ నుంచి గోవులను దానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో కనకదుర్గ ఆలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆవుల సంరక్షణ ఆయా ఆలయాలదేనని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి టీటీడీకి గోవులను దానం ఇవ్వొచ్చని తెలిపారు. వాటిని తిరిగి గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా వివిధ ఆలయాలకు దానం ఇవ్వనున్నట్లు తెలిపారు.
గుడికో గోమాత కార్యక్రమం-వివరాలు
ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు నిర్ణయించింది.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో… జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటకలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.













