ఈ నెల 21న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరిగింది. ఈ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రులకు సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ నెల 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షుడు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కాగా, రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.













