త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డ్..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆసరా పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన ప్రభుత్వం తాజాగా.. రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పనకు రెడీ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్‌కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డు ద్వారా మెరుగైన, అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, మెరుగుపరచాల్సిన వైద్య వసతులు, తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య ఆరోగ్యశాఖకు ప్రాధాన్యం తదితర అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.. డిజిటల్ హెల్త్‌కార్డులను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
హెల్త్‌కార్డు ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం, అనారోగ్య పరిస్థితులు, గతంలో అందిన వైద్యం, చికిత్స, ఉపయోగిస్తున్న మందులు, సమస్య, డాక్టర్ల అభిప్రాయం, విశ్లేషణ వంటి అంశాలన్నీ డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ చికిత్సకు వెళ్లినా ఈ వివరాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు వెంటనే తెలియడంతో మెరుగైన చికిత్స, వైద్యసేవలకు అవకాశం ఉంటుంది. ఈ కార్డును ఆరోగ్యశ్రీతోను.. ఆధార్‌తోనూ అనుసంధానం చేస్తారు.
సమాచార సేకరణ విధానం..
క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ఎత్తు, పొడవు, బరువు వంటి వివరాలతో పాటు రక్త, మూత్ర పరీక్షలు చేసి వాటిద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి నమోదు చేస్తారు. బీపీ, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా గుర్తిస్తారు. ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే వాటిని కూడా చేస్తారు. సమస్యలు ఉంటే నమోదు చేసి చికిత్స అందిస్తారు. ఇలా వ్యక్తిగత రికార్డులను రూపొందిస్తారు. అనంతరం వారికి అవసరమైన వైద్యసాయం అందిస్తారు.
ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లినా గుర్తింపు సంఖ్య నమోదుతో వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ప్రజల వ్యక్తిగత వైద్యమే కాకుండా వివిధ రూపాల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిని గుర్తించేందుకూ అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ‘డిజిటల్’ డేటాను భద్రపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ విభాగం సమన్వయంతో దీనిపై దృష్టి సారించనుంది.













