దావోస్ పర్యటన విజయవంతం.. భారీ స్థాయిలో పెట్టుబడులు
దావోస్ పర్యటన విజయవంతమైందని, తెలంగాణ ఏర్పాటు తరువాత అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగలిగామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు తెలంగాణను తొలి రాష్ట్రంగా ఎంచుకునేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించడంలో విజయం సాధించామన్నారు. మొత్తం 40,232 కోట్ల పెట్టుబడులతో, 3 వేల ఉద్యోగాల కల్పన జరిగేలా దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మూడు రోజుల దావోస్ పర్యటన ముగింపు సందర్భంగా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కూడా కాక ముందే ఇంత భారీస్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.
టాటా గ్రూప్, అదానీ, జిందాల్, గోడి ఇండియా, వెబ్ వెర్క్స్, ఆరాజెన్ లైఫ్ సైన్సెస్, గోద్రెజ్ ఇండియా, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, ఉబర్, క్యూ సెంట్రియో, ఓ9 సొల్యూషన్స్ వంటి కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టుల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయని వివరించారు. దావోస్‌కు రావడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలని తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు.













