నిబంధనలు పాటించని పబ్‌లు, మద్యం దుకాణాల లైసెన్స్ లు రద్దు చేయండి : తెలంగాణ హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వ వ్యవహారంపై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని పెదవి విరిచింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ టెస్టులను 70 శాతం పెంచాలని ఆదేశించింది. అలాగే మద్యం దుకాణాలు, పబ్‌లపై కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మద్యం దుకాణాలు కరోనా క్యారియర్స్‌గా మారాయని వ్యాఖ్యానించింది. కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపడుతుందో వివరిస్తూ తెలంగాణ డీజీపీ హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇవే కరోనా క్యారియర్స్‌గా మారాయని పేర్కొంది. కరోనా నిబంధనలను బేఖాతర్ చేసే వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లైసెన్స్‌ను రద్దు చేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే నిబంధనలను పాటించని వారి విషయంలో తాము జరిమానాలు విధిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే జరిమానా విధించారా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించింది. లాక్డౌన్ కాకపోయినా, కనీసం కంటైన్మెంట్ జోన్లనైనా ప్రకటించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.













