దళితుల కోసం కార్పస్ ఫండ్ : సీఎం కేసీఆర్

దళితుల సమస్యలు ఒకే రకంగా లేవని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. ఆయా ప్రాంతాలు, నగరాలు, మెట్రో నగరాల్లో దళితుల సమస్యలను మేధావులు, విద్యావంతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటికి ఏ విధానాన్ని అవలంబిస్తే శాశ్వత పరిష్కారాలను సాధింగలమో ఆలోచించాలని కోరారు. ‘దళిత సాధికారత పథం’అమలు ద్వారా దళితుల కష్టాలను తీసేయవచ్చని, దీనిపై కూడా దృష్టి సారించాలని మేధావులను కోరారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దళిత మేధావులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… దళితుల్లో గుణాత్మక మార్పు రావడానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ‘సీఎం దళిత సాధికారిత పథకం’కోసం పటిష్ఠమైన వ్యూహాన్ని అమలు చేస్తామని, భవిష్యత్తులో ‘కార్పస్ ఫండ్’ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మరియమ్మ లాక్‌డెత్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొందరగా స్పందించారని, దళితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని దళిత మేధావులను కోరారు. తెలంగాణ సమాజం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు అనేక రకాల ఫలాలను ఇస్తున్నాయని, వాటితో దళితులు కూడా లబ్ధి పొందుతున్నరని అన్నారు. దళితుల్లో ఉన్న పేదరికాన్ని పారద్రోలడానికి రానున్న కాలంలో ఈ పథకం ద్వారా 40 వేల కోట్లను ఖర్చు చేస్తామని, దీనికి తోడుగా కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారునికే సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షంలో కూడా నిర్ణయం తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపడానికి మరింతగా ఏం చేయాలన్న దానిపై దళిత మేధావులతో రోజంతా వర్క్‌షాప్ నిర్వహిస్తామని, వాటి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.