తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్ ?

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కువ ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా తెలంగాణకు వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు రాష్ట్రంలో కాంటాక్టు వ్యక్తుల్లోను ఒమిక్రాన్ నిర్ధారణ కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైద్య, ఆరోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి రెండో దశకు చేరితే ఇక అడ్డుకట్ట వేయడం కష్టమన్న ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రెండు వారాల్లోపే తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రమాదకరంగా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ కాంటాక్టుల్లోనూ వ్యాప్తి చెందుతుండడంతో రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్, ఇతర సామూహిక కార్యక్రమాలపై ఆంక్షల దిశగా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1న పబ్‌లు, బార్లు, పార్టీలపై ఆంక్షలు విధించి పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.