మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు గడుస్తున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల షెడ్యూల్ కూడా కేసీఆర్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి స్మారకం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దశాబ్ది ముగింపు వేడుకల సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేయనున్నారు. ఇక జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ముగింపు పలకనున్నారు.