ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్ మార్గ్ వద్దకు చేరుకున్న కేసీఆర్ మోదీతో సమావేశమయ్యారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోదీతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కోరనున్నారు. అలాగే షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రిజర్వేషన్ల పెంపు, తదితర అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణకు నూతన సచివాలయ నిర్మాణం, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణశాఖ భూములు అప్పగించే అంశాలనూ ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.
కేసీఆర్.. మోదీ భేటీ అందుకేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు వివిధ పార్టీలను కలిసిన కేసీఆర్ ఇవాళ ప్రధానిని కలుస్తున్నారన్నారు. ఫ్రంట్ అరటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ ప్రధానిని కలుస్తున్నారంటే అర్థమేమిటి అని ప్రశ్నించారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా లేక సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా అని చంద్రబాబు అడిగారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.













