హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ… విజేత ఎవరు?
తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ ఓట్లు నమోదు కాగా, మొదటి అరగంట పాటు వాటిని లెక్కించనున్నారు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాలులో 7 టేబుళ్లు చొప్పున మొత్తం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్ ఫలితానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. వీవీప్యాట్ తరలింపు గందరగోళంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లోని పరిస్థితిని తెలుసుకొనేందుకు సీసీ కెమెరా దృశ్యాలను బయట ప్రదర్శించాలని నిర్ణయించారు. సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెలువడే అవకాశం ఉండగా రికార్డు స్థాయిలో పోలింగ్ తమకే అనుకూలమని ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.













