అజారుద్దీన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
టీమ్ఇండియా టెస్టు క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులు సవాల్ చేస్తూ అజహరుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇది కేవలం ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని, ఈ దశలో తాము పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు తమను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఏడాది ఆరంభంలో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు అజహరుద్దీన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులపై తాజాగా అజహరుద్దీన్ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.













