న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ చేయూత
న్యాయాధికారుల సదస్సులో సీజేఐ రమణ
న్యాయవ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. చేతికి ఎముకలేని తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రేడ్‌మార్క్ అని ప్రశంసించారు. దేశంలో చాలాచోట్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతుండగా, సీఎం కేసీఆర్ మాత్రం న్యాయవ్యవస్థలో నాలుగు వేల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించడం అభినందనీయమని మెచ్చుకొన్నారు. ఇందుకు న్యాయవ్యవస్థ తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల రెండు రోజుల సదస్సును ఆయన సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా జస్టిస్ రమణ ప్రసంగిస్తూ.. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తరుణంలో న్యాయవ్యవస్థ అగ్రగామిగా ఉండాలన్న తపన కేసీఆర్‌లో కనిపిస్తున్నదని కొనియాడారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను నెలకొల్పాలన్న తన కలను కేసీఆర్ సాకా రం చేశారని గుర్తుచేశారు. అత్యంత విలువైన భూమి తోపాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరుచేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిషరించడం వల్ల కొత్త కంపెనీల ఏర్పాటుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ తరహాలో తమ రాష్ట్రంలో కూడా ఐఏఎంసీని ఏర్పాటుచేయాలని మహారాష్ట్ర వంటి చోట్ల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, అయితే, హైదరాబాద్ కేంద్రం లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించిన తర్వాత ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్పినట్టు వివరించారు.













