మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి..! ఈవిడనే ఎందుకు..?
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మునుగోడు బైపోల్ అభ్యర్థిని తేల్చేసింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించింది. ఈవిడ దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె. మునుగోడు నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదు సార్లు గెలిచారు. స్థానికంగా పాల్వాయి కుటుంబానికి మంచి పట్టు ఉండడంతో ఆ కుటుంబానికే చెందిన పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. మునుగోడులో పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. కృష్ణారెడ్డి, కైలాశ్ నేత, పల్లె రవి తదితరులు టికెట్ ఆశించారు. అయితే కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి మధ్య టికెట్ కోసం గట్టి పోటీ నడిచింది. చివరకు పాల్వాయి స్రవంతినే టికెట్ వరించింది.
పాల్వాయి కుటుంబానికి మునుగోడు నియోజకవర్గంలో మంచి పట్టుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడింది స్రవంతి. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చింది. 27వేలకు పైగా ఓట్లు సాధించింది. ఇప్పుడు టికెట్ పొందడానికి ఇది కూడా ఒక కారణం. స్వతంత్రంగా పోటీ చేసినప్పుడే అన్ని ఓట్లు సాధించిన స్రవంతికి.. ఇప్పుడు పార్టీ తోడుగా నిలిస్తే గెలుపు సాధ్యమని పార్టీ నమ్మింది. జిల్లా సీనియర్ నేతలందరూ స్రవంతి వైపే మొగ్గు చూపారు. రేవంత్ రెడ్డి మాత్రం కృష్ణారెడ్డి వైపు ఆసక్తి కనబరిచారు. కానీ లోకల్ గా పట్టుండడం, సీనియర్లు సిఫారసు చేయడంతో ఎంతో మంది పోటీలో ఉన్నా స్రవంతి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది.
రెడ్డి సామాజిక వర్గానికి చెందడం, కోమటిరెడ్డి కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉండడం పాల్వాయి స్రవంతికి కలిసొచ్చాయి. నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువ. అయినా వారితో సన్నిహిత సంబంధాలు పాల్వాయి కుటుంబానికి ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ సొంత కేడర్ ఉంది. ఇవన్నీ తనకు కలిసొస్తాయని స్రవంతి భావిస్తున్నారు. పైగా నికార్సయిన కాంగ్రెస్ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కోమటిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో ఉన్నా నిత్య అసంతృప్తితో కేడర్ కు దూరమైందని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పాల్వాయి కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ కచ్చితంగా విజయానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
మనుగోడు నియోజకవర్గంపై ప్రియాంక గాంధీ నేరుగా దృష్టి సారించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకరించడం లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ తరపున ఎంపీగా ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవట్లేదు. తన సోదరుడే బీజేపీ తరపున బరిలోకి దిగుతుండడంతో ఆయన దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో నేతలందరినీ సమన్వయ పరచి పార్టీ కోసం పనిచేయించే బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పడు అభ్యర్థి ఎంపికలో కూడా ప్రియాంక గాంధీ ప్రముఖ పాత్ర పోషించినట్లు సమాచారం.













