తెలంగాణలో సోనియా గాంధీ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19 తర్వాత సోనియా గాంధీ పర్యటించబోతున్నారు. రెండు రోజుల పాటు సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణలో ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ప్రజాకూటమి పేరుతో నాలుగు పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోనున్నాయి. ఈ క్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించేలా ఈ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ నెల 19న జాతీయ నాయకులతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోనియా గాంధీతో రెండు దఫాలుగా తెలంగాణలో ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 19వ తేదీ అనంతరం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు, దక్షిణ తెలంగాణలో రెండు రోజుల పాటు సోనియా గాంధీతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. సోనియా తర్వాత పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.













