ఎన్ఆర్ఐ మోసాలపై అవగాహనపై సదస్సు
ప్రవాస భారతీయుల వివాహాలకు సంబంధించి మోసాలపై మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, సమస్యలు, తదితర అంశాలపై న్యాయ సంబంధిత చట్టాలపై అవగాహనా కల్పించేందుకు నేడు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం తెలిపింది. ప్రవాస భారతీయులు చేసే వివాహ సంబంధిత మోసాలను ఎదర్కొనేందుకై తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం ద్వారా దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఎన్ఆర్ఐ సెల్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ వివాహ సమస్యలపై సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ప్రారంభించే ఈ సదస్సులో డీజీపీ మహేందర్ రెడ్డి కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ ఎం.వి.రమేష్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, పోలీసు, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.













