హైదరాబాద్ కు చేరిన స్పుత్నిక్-వీ

కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో మరో అడుగు ముందుకు పడింది. తాజాగా ప్రత్యేక విమానంలో 60 వేల స్పుత్నిక్-వి టీకా డోసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రష్యా లో 2020 ద్వితీయార్థం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్‍ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో స్పత్నిక్-వి టీకా మెరుగ్గా పనిచేస్తోందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. భారత్‍లో దీని తయారీని దశలవారీగా ఏడాదికి 850 మిలియన్ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో సింగిల్ డోస్ స్పత్నిక్ లైట్ వ్యాక్సిన్‍ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
భారత్‍లో స్పుత్నిక్-వి టీకా తయారీ, పంపిణీ చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‍తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతగా 1.5 లక్షల డోసుల స్పత్నిక్-వి టీకాను ఈ నెల 1న డాక్టర్ రెడ్డీస్‍కు అందాయి. వాటిని పంపిణీ చేసేందుకు హిమచల్‍ప్రదేశ్‍లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతిచ్చింది. డా.రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ వ్యాపార విభాగానికి అధిపతి దీపక్‍సప్రా తొలి స్పుత్నిక్-వి డోసు తీసుకున్నారు.