పాఠశాలలు మూసేస్తేనే బాగు : రాష్ట్రానికి విద్యాశాఖ ప్రతిపాదన
తెలంగాణలో కరోనా విజృంభిస్తోందని, పాఠశాలలను మూసేస్తేనే బాగుంటుందని విద్యాశాఖ స్పష్టమైన ప్రతిపాదనతో ముందుకు వెళ్తోంది. ఇదే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందు కూడా ఉంచుతున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం మాత్రం మరో రెండు రోజుల్లో సీఎం తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది పిల్లలకు కరోనా సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కరోనా సోకినా… ఆ లక్షణాలు బయట పడవని, కానీ.. అలాగే పాఠశాలలను కొనసాగిస్తే, అది కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి చేయాలంటే పాఠశాలలు, గురుకులాలు మూసేయడమే ఏకైక ప్రత్యామ్నాయం అని విద్యాశాఖ భావిస్తోంది. ఇక తల్లిదండ్రుల్లోనూ ఈ విషయంలో తీవ్రమైన భయం నెలకొంది. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలకు పంపిస్తున్నా…. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నా… భౌతికంగా హాజరైతేనే చదువు ఒంటబడుతుందని తల్లితండ్రుల ఆలోచనగా ఉంటోంది. ఏది ఏమైనా కేసుల సంఖ్య దృష్ట్యా పాఠశాలలను మూసేయడమే సరైన నిర్ణయమని విద్యాశాఖ ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చేసింది.













