సీఎం రాజీనామా చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన డిమాండ్

వనపర్తి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్యోదంతంపై ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ స్పదించారు. ఈ హత్య కచ్చితంగా రాజకీయ హత్యేనని, తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పథకం ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని ఎక్స్ వేదికగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ హత్యలకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆర్ఎస్ నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు.
‘‘ఇది ప్రజా పాలన కాదు-ప్రతీకార పాలన. అధికార పార్టీకి చెందిన దుండగులు యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నా వారిని అరెస్ట్ చేయకపోవడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయి. నిందితులతో కొందరు స్థానిక పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు. వారిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా శిక్షించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి’’ అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా అచ్చంపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు కానీ, స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను కానీ ఏర్పాటు చేయాలని, ప్రాణాలకు ముప్పు ఉన్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలని ఎక్స్ వేదికగా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.