కాళేశ్వరంపై అమెరికాలోనూ ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితోపాటు వారసత్వ సంపద రక్షణ, మహిళ భద్రత కోసం తీసుకుంటున్న కార్యక్రమాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మోటార్ బైక్ రైడర్ జయ భారతికి సూచించారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా జయ భారతి నేతృత్వలో 7 దేశాలు, 17 వేల కిలోమీటర్లను మహిళా బైక్ రైడర్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరు చేసిన సాహస యాత్రపై రూపొందించిన రోడ్డు టూ మెకాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుల్లో ఒక్కటైన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నూతనంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై అమెరికాలో ప్రచారం నిర్వహించాలని బైక్ రైడర్లకు సూచించారు. వీటితోపాటు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ, బొడ్డెమ్మ పండుగల విశిష్టతలపై ప్రచారం చేయాలన్నారు. గతంలో ప్రచారం నిర్వహిచిన మాదిరిగానే ఇప్పుడు కూడా బైక్‌లపై తిరుగుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తామని జయ భారతి తెలిపారు.













