Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి కొండంత భారంగా మారిన సురేఖ..!? వేటు ఖాయమా..?

కొండా సురేఖ (Minister Konda Surekha) తెలంగాణలో సుపరిచితురాలు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది కొండా సురేఖ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో (Warangal District) కొండా ఫ్యామిలీకి (Konda Family) మంచి పట్టుంది. దీంతో ఆమెను మంత్రివర్గంలోకి (Cabinet) కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల కొండా సురేఖ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఆమె తెలిసి చేస్తోందో.. తెలియక చేస్తోందో ఆర్థం కాక హైకమాండ్ తల పట్టుకుంటోంది.
కొండా సురేఖ కొంతకాలంగా వార్తల్లో ఉంటున్నారు. మంత్రిగా ఉంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working Presindent KTR) టార్గెట్ గా ఆమె చేసిన కామెంట్స్ లో సమంత (Samantha), నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీని లాగారు. నాగచైతన్యతో (Naga Chaitanya) సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని కొండా సురేఖ చెప్పారు. ఇది తీవ్రదుమారం రేపింది. కొండా సురేఖపై నాగార్జున, కేటీఆర్ పరువునష్టం దావాలు దాఖలు చేశారు. వీటిపై కోర్టులో విచారణ జరుగుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా వాళ్లు వెనక్కు తగ్గలేదు. పైగా సినిమా ఇండస్ట్రీ (Cine Industry) మొత్తం కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టింది.
ఒకవైపు ఈ దుమారం కొనసాగుతుండగానే జిల్లాలో పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. దసరా (Dasara) సెలబ్రేషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో (Flexy) కొండా సురేఖ ఫోటో పెట్టలేదంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (MLA Revuri Prakash Reddy) బ్యానర్లను ఆమె అనుచరులు చించేశారు. ఇది చినికిచినికి గాలివానగా మారింది. రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదుతో కొండా సురేఖ అనుచరులపై కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్ (police station) కు వెళ్లి సీఐ కుర్చీలో కూర్చుని హల్ చల్ చేశారు. తన వాళ్లపైనే కేసులు పెడతారా అని రెచ్చిపోయారు. హుటాహుటిన ఎస్పీ అక్కడకు చేరుకుని క్షమించాలని వేడుకున్నారు. ఇది పెద్ద దుమారమే రేపింది.
తాజాగా.. వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయానికి (Rajanna Temple) వెళ్లారు కొండా సురేఖ. అయితే ఆమె వెళ్లిన సమయంలో స్వామివారికి నైవేద్యాలు సమర్పించాల్సి ఉంది. అయితే నైవేద్యాలు తర్వాత.. ముందు నా పూజల సంగతి చూడండి అని కొండా సురేఖ అర్చకులను గద్దించారు. దీంతో నైవేద్యాలను అరగంట ఆలస్యంగా సమర్పించినట్టు సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో అపచారం జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.
మొత్తంగా కొండా సురేఖ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాలకు కారణమవుతోంది. రాష్ట్రాన్ని ఇచ్చినా పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి వివాదాలు ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా కొండా సురేఖ తీరుపై హైకమాండ్ (Congress High Command) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.