కేసీఆర్ కుటుంబ చిట్టా విప్పబోతున్న రేవంత్ రెడ్డి!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేన్నరేళ్లు పూర్తయింది. మిగిలిన మరో రెండున్నరేళ్ల కాలంలో రాజకీయంగా మరింత పట్టు సాధించి, రాబోయే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన దూకుడును పెంచారు. ఇంతకాలం కేసీఆర్ కుటుంబంపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతూ వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి విమర్శల దాడిని తీవ్రం చేశారు. తానే గనుక గతంలోనే దృష్టి పెట్టి ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడో జైలుకు పంపేవాడినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.
ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వరుస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ ఉన్న ఆక్రమణలపై స్పందించిన ఆయన.. దీనిపై కేవలం 30 రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తాజాగా అధికారులు ఆ సర్వేను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో కొన్ని అక్రమాలు జరిగినట్లు తేలినట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్ కుటుంబీకులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.
మరోవైపు సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైదరాబాద్లో 3 స్టార్ హోటల్స్ ఉన్నాయని ఆయన బాంబు పేల్చారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన కేటీఆర్, తనకు హోటల్స్ ఉన్నట్లు అంగీకరించారు. రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపెట్టే వరకు కేటీఆర్ హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారనే సంగతి చాలా మందికి తెలియదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన మరిన్ని రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయానికి కేసీఆర్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో వారి ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయి? అనే అంశాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విడతల వారీగా మరికొన్ని చిట్టాలను ప్రజల ముందుంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారం చేపట్టి, ఆ తర్వాత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం భారీగా అస్తులు కూడబెట్టిందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు.
మొత్తానికి.. రాబోయే రెండున్నరేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికితీసి.. వారిని రాజకీయంగా, నైతికంగా దోషులుగా నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో వేచి చూడాలి.








