గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 14తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీళ్ల స్థానంలో ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానిపై గాంధీ భవన్ లో ఇప్పటి నుంచే జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ పదవులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆశావహులు.. తమ పరిధి మేరకు పైరవీలు చేసుకుంటున్నారు.
వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని పద్మశాలి వర్గానికి కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందే చెప్పారు. దీంతో ఈ స్థానం కోసం పైరవీలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గుండు సుధారాణి, ఈరవత్రి అనిల్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకరనేత పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరొకటి బ్రాహ్మణ వర్గానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఇందుకోసం పరిశీలనలో ఉన్నాయి. అలాగే మాజీ మంత్రి పుష్పలీల, పార్టీ సీనియర్ నాయకులు వక్లగడ్డ చంద్రశేఖర్, సతీశ్ మాదిగ తదితరులు కూడా తమ ప్రయత్నాలు వేగవంతం చేశారు.
మరోవైపు.. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో కనీసం రెండు సీట్లను బీసీలకే కేటాయించాలని ఆ వర్గాల నేతలు పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యపడకపోతే.. మున్నూరు కాపు నేత సత్తు మల్లేశం, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్‌కౌశిక్ యాదవ్ తదితరులు తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించే కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత గుండెపల్లి దయాసాగర్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.








