దేవుళ్లపై రేవంత్ రాజకీయం.. ఎవరికి ప్లస్?
మతపరమైన రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకుంది. ఆ పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ అజెండాకు విరుగుడు కనిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సరికొత్త వ్యూహానికి తెరలేపింది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు దేవుళ్ల చుట్టూ రాజకీయాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే కాంగ్రెస్ నేతల కామెంట్స్ ఆ పార్టీకి మేలు చేస్తాయా.. లేక బీజేపీకి ప్లస్ అవుతాయా.. అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాముడు ధనికుల దేవుడని, శివుడు పేదల దేవుడని అభివర్ణించారు. ఉత్తరాది వారు ఆర్యులని, దేవుడిగా రాముడిని కొలుస్తారని, కానీ దక్షిణాది వారమైన తాము ద్రావిడులమని, శివుడిని ఆరాధిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బీజేపీ హిందూ దేవుడైన శ్రీరాముడిని హైజాక్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శ్రీరాముడు, పరమశివుడి మధ్య పేద, ధనిక అంతరాలను ఆపాదించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయంగా ద్రావిడ వాదాన్ని తెరపైకి తెస్తూనే, దైవ భావనకు కూడా వర్గ పోరాట రంగు పులమడం కాంగ్రెస్ కొత్త రాజకీయ వ్యూహానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
అయితే.. బీజేపీ దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వస్తున్న హిందూ ఓటు బ్యాంకును చీల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూ సమాజంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నప్పటికీ, భారత్లో రాముడు, శివుడు అనే భేదాలు లేకుండా హరిహరులుగా ఇద్దరినీ కలిపి ఆరాధించే విశిష్ట సంస్కృతి ఉంది. ముఖ్యంగా తెలంగాణలోనే భద్రాచలం శ్రీరాముడిని దక్షిణ అయోధ్యగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దక్షిణ కాశీగా సమానంగా పూజిస్తారు. ఇటువంటి పవిత్రమైన ప్రాంతానికి చెందిన ముఖ్యమంతే రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను ఉత్తర – దక్షిణ భాగాలుగా, ధనిక – పేద వర్గాలుగా విభజించడం వెనుక క్షేత్రస్థాయిలో రాజకీయ లబ్ధి పొందాలనే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే కాంగ్రెస్ వేస్తున్న ఈ అడుగులు ఆ పార్టీకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్వాసాలు, భక్తి కేంద్రాల చుట్టూ జరిగే ఈ విభజన రాజకీయాలు ఆఖరికి బీజేపీకి మరింత రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. హిందూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం ద్వారా, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని, నకిలీ సెక్యులరిజాన్ని పాటిస్తోందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి బీజేపీకి బలమైన అస్త్రం దొరికినట్లయింది.
మతతత్వ రాజకీయాలు అంటేనే బీజేపీ గుర్తొస్తుందని, మతపరమైన అంశాలను సొమ్ము చేసుకోవడంలో ఆ పార్టీ ముందుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. హిందూ దేవుళ్ల మధ్య విభజన రేఖ గీయడం ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్ లౌకిక లేదా తటస్థ ఓటర్లను కూడా దూరం చేసే ప్రమాదం ఉంది.








