దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ …తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ పెట్టుబడులు పెట్టండి అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుసగా కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు.
అనంతరం ఇథియోపియా ఉప ప్రధాన మంత్రి డెమెక్ హసెంట్తో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఆ తర్వాత నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కమ్) అధ్యక్షురాలు దేబ్జానీ ఘోష్‌తో సీఎం బృందం సమావేశమైంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించడం, ఇందుకోసం అనుసరించే భవిష్యత్తు మార్గాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పనకు సాయం తదితర అంశాలపై సంప్రదింపులు జరిపారు. యూపిఎల్ గ్రూప్ సంస్థ సీఈవో జయ్ష్రాఫ్తో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.













