కాంగ్రెస్ కు కరెంట్ షాక్..?
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? అమెరికాలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా..? చేజేతులారా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి అస్త్రం అందించిందా..? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది..
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ తరపున ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ .. అవినీతికి పాల్పడిందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపు కలిగి ఉన్నారన్నారు. వారికి 3 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తే.. మూడెకరాల పొలం తడుస్తుందన్నారు. అయితే ఈసందర్భంలో 8 గంటల పాటు ఒకేసారి నాణ్యమైన ఉచిత కరెంటిస్తే సరిపోతుందన్నట్లు రేవంత్ అభిప్రాయపడ్డారు.విద్యుత్ సంస్థల నుంచి కమిషన్లకోసం ఉచిత విద్యుత్ పేరుతో ప్రజల్ని కేసీఆర్ సర్కార్ మభ్యపెడుతోందన్నారు రేవంత్..
అయితే ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఉండదంటూ .. బీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు విరుచుకుపడుతున్నారు.పచ్చబడ్డ తెలంగాణపై విషం చిమ్ముతున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు విద్యుత్ షాక్ ఇవ్వాలన్నారు మంత్రి హరీశ్ రావు.
దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు… నష్టనివారణ చర్యలు ముమ్మరం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ విధానమని.. అధికారంలోకి రాగానే అమలు చేసి తీరతామంటున్నారు. ప్రజలు గందరగోళపడొద్దని సూచిస్తున్నారు.
బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని మరోసారి రుజువైందన్నారు రేవంత్ రెడ్డి. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అంటూ ప్రభుత్వం.. రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు.ఆ విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు.













