తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ?

తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైనట్టు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలోని నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఒక నివేదిక తయారు చేసి అధిష్టానానికి అందజేశారు. పార్టీలో చాలా మంది నేతలు రేవంత్ రెడ్డిని కోరుకున్నట్టు తెలిసింది. కొందరు ఇతర సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరినప్పటికీ, ఆయా వర్గాల నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వహించగలిగే నేతల పేర్లను మాత్రం ప్రతిపాదించలేకపోయారని, ఈ విషయాలన్నింటీని క్రోడీకరించి మాణిక్యం ఠాగూర్ తన నివేదికను తయారు చేశారని తెలిసింది.
ఇప్పుడు తెలంగాణ పీసీసీ సారథి కోసం మళ్లీ కొత్తగా కసరత్తు చేపడతారా, లేక ఈ కసరత్తు ఆధారంగా అప్పుడు తీసుకున్న నిర్ణయాన్నే ప్రకటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి పేరునే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ సారథితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా ఒకసారి కలిసి ప్రకటించే అవకాశాలున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గం నుంచి మధుయాష్కిని, దళిత సామాజిక వర్గం నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మైనారిటి వర్గం నుంచి షబ్బీర్ అలీ పేర్లును ఖరారు చేసే అవకాశముందని చర్చ జరుగుతోంది.