బీఆర్ఎస్ తో దేశంలో గుణాత్మక మార్పు
భారత్ రాష్ట్రసమితి పార్టీ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సంభవిస్తుందని, దీనికి ప్రవాసుల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఖతర్ టీఆర్ఎస్ ప్రవాసశాఖ తీర్మానించిది. టీఆర్స్ ప్రవాస విభాగాల సమన్వయకర్త బిగాల మహేశ్ ఆధ్వర్యంలో దోహాలో టీఆర్ఎస్ ఆ దేశ శాఖ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బాగాని ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో, దేశాన్ని అభివృద్ధి పథాన నడపడంలో దారుణంగా విఫలమయ్యాయన్నారు. ఇప్పటికీ దేశంలో కరెంటు లేని గ్రామాలు, మంచినీరు, రహదారులకు నోచుకోని పల్లెలు ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. తెలంగాణ అద్భుత ప్రగతిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఆ అభివృద్ధి దేశమంతటికి విస్తరించాలనే కాంక్షతోనే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీకి రూపకల్పన చేశారన్నారు. పార్టీపై ప్రకటన వెలువడిన అనంతరం బీఆర్ఎస్ విజయవంతానికి ప్రతి ప్రవాసుడు కృషి చేయాలని కోరారు.













