చంపేస్తాం! ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్
సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో వర్తమాన రాజకీయాలను విశ్లేషిస్తూన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌కు చంపేస్తామంటూ అగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ బెదిరింపు కాల్స్ వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. గత జులై 25న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ ద్వారా వాయిస్ ఆధారిత కాల్ చేసి నాగేశ్వర్‌ను చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు.
గత కొంత కాలంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన రాజకీయ విశ్లేషణలతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని బాగా ఆకట్టుకున్నారు. సామాజిక అంశాలపై అవగాహన, రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై ఉన్న విస్తృతమైన అవగాహనతో ఆయన టీవీ చర్చల్లో తరచుగా పాల్గొంటుంటారు. అంతేకాకుండా వర్తమాన రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఆయన ప్రతి రోజూ యూట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటికి వీక్షకుల నుంచి స్పందన కూడా బాగుంటోంది. ఈ నేపధ్యంలోనే ఆయన కొందరికి విరోధిగా మారి ఉండవచ్చునని సందేహిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ గత నెల 25న తనకు కొందరు అగంతుకులు ఫోన్ చేశారని సామాజిక మాధ్యమాల్లో తన విశ్లేషణ, మాటతీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. చంపుతానని కూడా బెదిరించారన్నారు. దీంతో తనకు వచ్చిన బెదింపులకు సంబంధించిన ఫిర్యాదును డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ, వారు అందుబాటులోకి రాలేదన్నారు. తాను ఫిర్యాదు ఇచ్చి 12 రోజులైనా ఫిర్యాదు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకరమన్నారు. తనకే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ఏదేమైనా ఈ తరహా బెదిరింపులకు తాను ఏ మాత్రం భయపడేది లేదని నాగేశ్వర్ తేల్చి చెప్పారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.













