విద్యార్థులకు ఆన్లైన్ బోధన!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పూర్తి స్థాయిలో ఆన్లైన్ విద్యా బోధనకు సిద్ధమవుతున్నాయి. జూన్ మొదటి వారం నుంచి ఈ-తరగతులు ప్రారంభించనున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిస్తున్నాయి. ఇందుకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, వాటిలో డేటా సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాయి. గతంలో ప్రకటించిన ప్రకారం కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. పాఠశాలల పున ప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. నిబంధనల ప్రకారం తరగతి గదిలో గరిష్ఠంగా 40 మంది విద్యార్థులు ఉండాలి. కొవిడ్ 19 నేపథ్యంలో తరగతుల నిర్వహణ కష్టం కానుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో 20 మందితో ఒక్కో తరగతి నిర్వహించాలని ప్రైవేటు పాఠశాలలు భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి హోంవర్క్ తో పాటు సందేహాలు నివృత్తి చేస్తున్నాయి. రోజుకు 4 గంటల పాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. నగరంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఉదయం రెండున్నర గంటలు, మధ్యాహ్నం గంటన్నర చొప్పున తరగతులు తీసుకోవాలని నిర్ణయించాయి. మరికొన్ని స్కూళ్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకపూట తరగతులు నిర్వహించనున్నాయి.
పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్లైన్ బోధన ఇబ్బందులు తప్పడం లేదు. లాక్డౌన్తో ఇప్పటికే వారి కుటుంబ ఆదాయం తగ్గిపోయింది. ఇద్దరు పిల్లలున్న వారికి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. వీరి చదువుల కోసం ఇప్పుడు ట్యాబ్, స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం రూ.10 వేలకు పైగానే ఖర్చు చేయాలి. ప్రతిరోజూ ఆన్లైన్ తరగతులకు వేగవంతమైన 2జీబీ డేటా అవసరమని పాఠశాలలు చెబుతున్నాయి. లాక్డౌన్ కారణంగా నెలకు సగటున 120 జీబీ నుంచి 200 జీబీ వరకు డేటా ఖర్చవుతోంది. ఫైబర్ కేబుల్ ఉంటే నెలవారీ అద్దెలో మార్పులతో డేటా పరిమితి, వేగం పెంచుతున్నారు. 200 జీబీ సామర్థ్యం కలిగిన డేటాకు నెలకు కనీసం రూ.500 పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది.













