యాత్రకు అనుమతి లేదు… తక్షణమే నిలిపివేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని కోరుతూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిలేదని, యాత్ర నిలిపివేయాలని కోరుతూ వర్ధన్నపేట ఏసీసీ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్కలు నోటీసులు అందజేశారు. పాదయాత్ర పేరుతో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లా నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నోటీసులు పరిగణనలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.













