గిరిజన విద్యార్థులకు ఎన్నారైల మద్దతు
గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకురావాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఆర్థిక స్తోమత లేక చదువు కొనసాగించేందుకు ఇబ్బందిపడుతున్న గిరిజన విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. తన పిలుపు మేరకు గిరిజన విద్యార్థులకు ఓ ఎన్నారై చేయూతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. నోకియా కార్పొరేషన్ ఆసియా సంస్థ నిర్వాహకుడు జీవీ సత్యనారాయణ నాయక్, ఆయన సతీమణి శంకుతల మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి గిరిజన విద్యార్థుల కోసం 100 బ్లాంకెట్లను అందించారు. అవసరమైతే విద్యార్థులకు మరింత చేయూత నిస్తానని తెలిపారు. గిరిజన విద్యాప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక కృషిచేస్తున్నదని, అందులో భాగంగానే గురుకులాలను సమర్థంగా నిర్వహిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.













