ప్రవాసులందరి ఆత్మీయుడు సాయిచంద్
లండన్ సమీపంలోని రీడింగ్ నగరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సంస్మరణ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యమ సమయం నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్నందున తమకు సాయి చంద్‌తో మంచి అనుబంధముందని, తాము చేసే కార్యక్రమాల్ని మీడియా ద్వారా తెలుసుకొని తమలో చాలా మందికి ఫోన్ చేసి అభినందించి ప్రోత్సహించే మంచి వ్యక్తిత్వం, సమాజాం పట్ల ఎంతో బాధ్యత ఉన్నవారు సాయిచంద్ అని గుర్తు చేసుకున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న సాయిచంద్ ఇలా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో మన మధ్యే ఎల్లప్పుడూ చిరంజీవిగా వర్ధిల్లుతాడని అశోక్ తెలిపారు.
ఎన్నికల అనంతరం సాయిచంద్‌ను లండన్ తీసుకురావాలని ఇటీవల లండన్ సందర్శనకు వచ్చిన మా సంస్థల వ్యవస్థాపకులు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పారని, ఇంతలోనే ఇలా జరగడం ఎంతో బాధగా ఉందని సతీష్ రెడ్డి బండ తెలిపారు. సాయిచంద్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని, భగవంతుడు ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని సీనియర్ నాయకుడు బీరం మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్ దూసరి, బీరం మల్లారెడ్డి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.













