నిరుపేద గిరిజన విద్యార్థికి.. ఎన్నారై శ్రీనివాస్ ఆర్థిక సహాయం
నిరుపేద గిరిజన విద్యార్థి ఉన్నత చదువులను అభ్యసించేందుకు ఓ తెలంగాణ ఎన్నారై ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన బాధవత్ గణేష్ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి కొడుకును ఇంటర్ వరకు చదివించారు. బైపీసీ చదివిన గణేష్ వైద్య విద్య అభ్యసించి జన్మభూమి రుణం తీసుకోవాలని భావించాడు. నీట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించినా ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుర్రాడు దిగాలు పడి ఎవరైనా సహాయం చేస్తారని ఎదురుచూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న షాద్ నగర్ నివాసి అమెరికాలో టెక్సాస్‌లో స్థిరపడిన ఎన్నారై పొట్టి శ్రీనివాస్ ముందుకొచ్చాడు. గణేష్ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని అండగా నిలవాలని సంకల్పించాడు. షాద్ నగర్లో ఉంటున్న తన మాతృమూర్తి అమృతమ్మకు విషయం చెప్పి ఆమె ద్వారా గణేష్‌కు ఆర్థిక సహాయం అందించాడు.
నీట్ ఎస్టీ విభాగంలో 829వ ర్యాంక్ సాధించి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలసుకున్న ఎన్నారై శ్రీనివాస్ కళాశాల ఫీజు 60 వేల రూపాయల డీడీనీ అందజేశాడు. తను కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అమెరికాలో స్థిరపడ్డానని, గత డిసెంబర్లో స్వంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండల కేంద్రంలో మన ఊరు మన బడిలో భాగంగా 18 లక్షలతో అన్ని హంగులతో ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గణేష్ ధన్యవాదాలు తెలిపాడు.













