ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు ఊరట
ఎమ్మెల్సీల అనర్హత వేటు వ్యవహారంలో రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వం, మండలి చైర్మన్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తనపై అనర్హత వేటు విధిస్తూ అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాముల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తన పిటిషన్ కొట్టివేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో రాములు నాయక్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.













