ఆయన స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన : కవిత
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే సంపూర్ణంగా నెరవేరుస్తున్నారని, ఆయన స్ఫూర్తితోనే అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనకు వెళ్లిన ఆమె అక్కడి అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శామ్కుమార్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. ఆమె వెంట టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఇతర నేతలు సుమన్, అశోక్, విజయ్, రోహిత, సంపత్, కిశోర్, వంశీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.













