బ్రిటిష్ వాళ్లు కూడా వేయలేదు కానీ… మోదీ ప్రభుత్వం ఆ పని చేసింది
చేనేత పై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేత పై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీదేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్తో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో నేతన్నలు ఆలోచించాలని కోరారు. పద్మశాలీలతో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకునే క్రమంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతూ వచ్చామని తెలిపారు.
తెలంగాణ రాకముందు పద్మశాలలీల కులవృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని తెలిపారు. దాంతో బాగా చదువుకొని చాలా మంది డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా ఆయా వృత్తుల్లో స్థిరపడ్డారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పద్మశాలీలు పేదరికంలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పద్మశాలీలు వ్యాపారంలో కూడా ఉన్నారని, వ్యాపారానికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని అన్నారు. శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బట్టల వ్యాపారస్తులకు అనేక ప్రోత్సాహకాలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుందని, 24 గంటల నిరంతర విద్యుత్తు ఇస్తుండడం వల్ల బట్టల దుకాణాల్లో డీజిల్ కంపు లేదన్నారు. గత ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను కుదేలు చేశాయని విమర్శించారు.













