లండన్ లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు కారణంగా గాజాలో ఏర్పడిన సంక్షోభం తనను కలిచివేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, యుద్దం ఏదైనా సరే బాధితుల్లో ముందు మహిళలు, చిన్నారులే ఉంటారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం వీలైనంత త్వరగా తొలగిపోవాలని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే గాజాలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న గొడవకు శాంతియుత పరిస్కారం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాజాలో ఏ తల్లీ కూడా తన బిడ్డలను కోల్పోవద్దనీ ప్రార్థిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం చేయడానికి కవిత లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.













