తెలంగాణలో మనఊరు-మనబడి పథకం.. ఎన్నారైల భాగస్వామానికి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఎన్నారైలంతా ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే వారు సూచించిన పేర్లను ప్రభుత్వ పాఠశాలలకు పెడతామని కూడా ప్రకటించారు. రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి తెలంగాణ ఎన్ఆర్ఐలతో కేటీఆర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటుపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ ప్రస్తుతం ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి విద్య, వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్రం పురోగతి సాధిస్తోందని అంటూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తెస్తూ ప్రాథమిక విద్య మొదలుకుని మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటు వరకు వందలాది విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడిరచారు. గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు సాధిస్తున్న విజయాలను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
26 వేల స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక
‘మన ఊరు మన బడి’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేయనుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసుల సాయాన్ని కూడా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరు ఇచ్చినా వారు సూచించిన పేరును పాఠశాలకు పెడతామన్నారు. రూ.10 లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సాయం చేసే వారు సూచించిన పేర్లు తరగతి గదులకు పెడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తోచినంత సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను రూపొందిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే బృహత్తర కార్యక్రమమే ‘మన ఊరు.. మన బడి’ అని విద్యా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అంటూ, రాష్ట్ర ఆవిర్భావంతో విద్యారంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని, మన ఊరు`మన బడితో ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యా శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. తొలి విడతలో 60 శాతంపైగా విద్యార్థులు చదివే 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసి, ఆయా పాఠశాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ఓ యజ్ఞంలా చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రణాళికలతో ముందుకు…
ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలో పనుల అంచనాలను రూపొందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నిధులు వృథా అయ్యే అవకాశం లేకుండా కలెక్టర్ పర్యవేక్షించనున్నారు. పాఠశాలలో అవసరమైన మరమ్మతు పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, ల్యాబొరేటరీ, లైబ్రరీ, ప్రహారి, వంట గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ తరగతులు తదితర పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం పక్కాగా ప్రణాళికలను రూపొందిస్తారు.













