మీకు ఆ ధైర్యం ఉందా? : తలసాని
బీజేపీ నాయకులు పదేపదే ముఖ్యమంత్రి కేసీఆర్ను అరెస్టు చేస్తామంటున్నారు. మీకు ఆ ధైర్యం ఉందా? అని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థకశాఖ, సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాములలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించకుంటే ప్రజలే మీపై తిరగబడతారన్నారు.
దేశం గర్వపడే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కేవలం రెండు ఎన్నికలలో గెలుపుకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికలను చూసిందన్న విషయన్నా మరవొద్దన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారికి సేవ చేసేందుకే వినియోగించాలని హితవు పలికారు.













