ఈ అంశంపై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్దమా? : మంత్రి తలసాని
సికింద్రాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అసలు తెలంగాణలో కేంద్రం ఏం అభివృద్ధి పనులను చేస్తుంది? మేమేం అడ్డుకుంటున్నామో చెప్పాల్సిన అసవరం ఉంది. గతంలో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాగే మాట్లాడారు. రాష్ట్రానికి రెండు మెడికల్ కాలేజీలు ఇవ్వమంటే కళాశాలలున్న ప్రాంతంలోనే అడుగుతున్నామని తెలిపారు. మరి మెడికల్ కాలేజీలు లేని కొత్త ప్రదేశంలో నిర్మించవచ్చు కదా. ఊరికే బట్టకాల్సి మీద వేయాలని కేంద్రం చూస్తోంది. వాటన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలి అని అన్నారు.
భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను ఎందుకు పిలవలేదు. అక్కడి నుచే కదా ప్రధాని`సీఎం మధ్య దూరం పెరిగింది. తెలంగాణలో అభివృద్ది జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారు? రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోంది. ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ అంశంపై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్దమా? రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతున్నాయని మోదీ అంటున్నారు. మరి బీజేపీ లో కుటుంబ పాలన లేదా? కర్ణాటకలో అవినీతిపై ప్రధాని ఎందుకు మాట్లాడరు ? అని తలసాని ప్రశ్నించారు.













