ఈ ఏడాది ఘనంగా.. ఆషాఢ బోనాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఘనంగా ఆషాడ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడ మాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అత్యున్నత సమావేశాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయామని అన్నారు. జులై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాద్ లాల్‍దర్వాజా బోనాల ఉత్సవాలు ఉంటాయని మంత్రి తెలిపారు.
25న జరిగే అత్యున్నతస్థాయి సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్‍లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు అని మంత్రి తలసాని తెలిపారు.