తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బుధవారం నుంచి విద్యాసంస్థలను మూసేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు శాసన సభలో ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ సీఎం కేసీఆర్కు ప్రతిపాదించింది. అందుకు తగ్గ కారణాలనూ వివరించింది. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ పై ప్రకటన చేశారు. ‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ బుధవారం నుంచి తాత్కాలికంగా మూసేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేతకు వైద్య కళాశాలలకు మినహాయింపు ఉంటుంది. అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. గతంలో లాగా ఆన్లైన్ తరగతులు మాత్రం యథావిథిగా నడుస్తాయి.’’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.













