చిన్న కమతాలకు సరిపోయే యాంత్రీకరణ జరిగితేనే.. ఇక్కడ
భారతదేశంలోని చిన్న కమతాలకు సరిపోయేలా యాంత్రీకరణ జరిగితే ఇక్కడి రైతాంగానికి మేలు జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి టెన్నెన్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియన్స్ల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలతో పాటు భారత్‌లోని కమతాలకు తగిన యంత్రాలు రావాలన్నారు. ఈ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలన్నారు. అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అమెరికాలో యంత్రాల సాయంతో ఎకరాకు 30 వేల పత్తి మొక్కలు సాగు చేస్తారన్నారు. రోజుకు 70 టన్నుల పత్తి తీసే యంత్రాలు అక్కడ పని చేస్తున్నాయని తెలిపారు. రోజుకు 52`70 హెక్టార్లలో ఒకేసారి పత్తిని తీసే సింగిల్ టైమ్ హార్వెస్టర్ ధర ఒక మిలియన్ అమెరికా డాలర్లుందన్నారు. టెన్నెన్సీ రాష్ట్రంలో ఏటా 5.5`6.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోందన్నారు. ఆయన వెంటన ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, డా.మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఎస్ సీడ్స్ ఎండీ కేశవులు ఉన్నారు.













