అధికారులు సిద్ధంగా ఉండాలి… ఎట్టి పరిస్థితుల్లోనూ : మంత్రి కేటీఆర్
భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరదల్లో ప్రాణనష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని, అయితే, దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.













