ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా….తెలంగాణలో
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా సంక్షేమ దినోత్సావాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. కడుపులో బిడ్డ పెరుగుతున్న నాటి నుంచి భూమిపైకి వచ్చే రోజు వరకు తల్లిని, బిడ్డను సురక్షితంగా కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. బిడ్డ పుట్టినప్పుడు ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, పెళ్లినాటికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆదుకుంటుందని వెల్లడించారు. ఆసరా, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందజేస్తుందన్నారు. ఆడ పిల్లలకు భద్రత కోసం షీ టీమ్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.













