నా పుట్టుక, చావు టీఆర్ఎస్ లోనే
తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, తన పుట్టుక టీఆర్ఎస్లోనే, చావు టీఆర్ఎస్లోనేనని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సృష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాటే తన బాట అని పేర్కొన్నారు. తాను ఉద్యమాలు, త్యాగాలు నుంచి వచ్చానని, తెలంగాణ కోసం రెండు సార్లు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశానని, తనకు త్యాగాలు తప్ప ద్రోహాలు తెలియని చెప్పారు. ఇతర పార్టీలో చేరుతున్నట్లు తనపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీడియా ప్రతినిదులు కూడా ఇలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని కోరారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు సోషల్‌మీడియాలో ఒక వీడియోను పెట్టారని, ఒక ప్రముఖ ఛానెల్లో ప్రసారమైనట్లు ఆ ఛానల్ లోగోను మార్పింగ్ చేసి, తప్పుడు పోస్టింగ్ చేశారని వివరించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, అందుకు కారణమైన వారిని జైలులో పెట్టాలని తాను డిజిపిని కోరినట్లు వివరించారు.













